కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

రోమీయులు 15:13​—“నిరీక్షణకర్తయగు దేవుడు … సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక”

రోమీయులు 15:13​—“నిరీక్షణకర్తయగు దేవుడు … సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక”

 “నిరీక్షణను ఇచ్చే దేవుడు మీరు తన మీద ఉంచిన నమ్మకం ద్వారా మీలో గొప్ప సంతోషాన్ని, శాంతిని నింపాలని కోరుకుంటున్నాను. అప్పుడు పవిత్రశక్తి బలం ద్వారా మీ నిరీక్షణ బలపడుతుంది.”—రోమీయులు 15:13, కొత్త లోక అనువాదం.

 “మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.”—రోమీయులు 15:13, పరిశుద్ధ గ్రంథము.

రోమీయులు 15:13 అర్థమేంటి?

 ఈ మాటలతో అపొస్తలుడైన పౌలు, తన తోటి విశ్వాసుల్లో దేవుడు “సంతోషాన్ని, శాంతిని” నింపాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ చక్కని లక్షణాలకు దేవుడిచ్చే నిరీక్షణతో, అలాగే పవిత్రశక్తితో సంబంధం ఉంది.

 దేవుడిచ్చే నిరీక్షణ గురించి ఆయన వాక్యమైన బైబిలు చెప్తుంది. రోమీయులు 15:4 లో ఇలా ఉంది: “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని పూర్వం [బైబిల్లో] రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.” ఇప్పుడు ప్రజల్ని బాధపెడుతున్న పేదరికం, అన్యాయం, జబ్బులు, మరణం లాంటి సమస్యల్ని తీసేస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి బైబిలు చెప్తుంది. (ప్రకటన 21:4) దేవుడు ఈ వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తాడు. కాబట్టి మనం మంచి భవిష్యత్తు వస్తుందనే నిరీక్షణతో ఉండవచ్చు.—రోమీయులు 15:12.

 మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే దేవుడిచ్చిన ఆ నిరీక్షణతో‘నింపబడతాం.’ మనం ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన పూర్తిగా నమ్మదగినవాడనే నమ్మకం అంత ఎక్కువగా బలపడుతుంది. (యెషయా 46:10; తీతు 1:2) దేవుడు అంత నమ్మదగిన నిరీక్షణను ఇస్తున్నాడు కాబట్టి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సంతోషంతో, శాంతితో నిండిపోవచ్చు.—రోమీయులు 12:12.

 శాంతి, సంతోషం, నిరీక్షణ అనేవాటికి ‘పవిత్రశక్తితో’ అంటే దేవుని చురుకైన శక్తితో a కూడా సంబంధం ఉంది. దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చడానికి పవిత్రశక్తిని ఉపయోగిస్తాడు, అది మనకు నిరీక్షణను ఇస్తుంది. అంతేకాదు పవిత్రశక్తి మనం సంతోషం, శాంతి లాంటి చక్కని లక్షణాలు పెంచుకోవడానికి సహాయం చేస్తుంది.—గలతీయులు 5:22.

రోమీయులు 15:13 సందర్భం

 బైబిల్లోని రోమీయులు పుస్తకం నిజానికి రోము నగరంలో ఉంటున్న క్రైస్తవులకు రాసిన ఒక ఉత్తరం. వాళ్లలో కొందరు క్రైస్తవులు యూదా కుటుంబాలకు చెందినవాళ్లు, కొందరేమో వేరేవాళ్లు. వాళ్ల నేపథ్యం, సంస్కృతి వేరైనా అందరూ ఆలోచనల్లో, పనుల్లో ఐక్యంగా ఉండడానికి కృషిచేయాలని పౌలు వాళ్లందర్నీ ప్రోత్సహించాడు.—రోమీయులు 15:6.

 అన్ని దేశాల ప్రజలు ఐక్యంగా తనను స్తుతించే ఒక సమయం వస్తుందని దేవుడు ఎంతోకాలం ముందే చెప్పాడని పౌలు రోములోని క్రైస్తవులకు గుర్తుచేశాడు. ఆ విషయాన్ని రుజువు చేయడానికి పౌలు హీబ్రూ లేఖనాల b నుండి నాలుగు వాక్యాల్ని ఎత్తి రాశాడు. (రోమీయులు 15:9-12) ఆయన ఏం చెప్పాలని అనుకున్నాడంటే, యూదులతో పాటు అన్నిదేశాల ప్రజలు క్రీస్తు పరిచర్య నుండి ప్రయోజనం పొందవచ్చు. రెండు గుంపుల వాళ్లకు దేవుడు ఇచ్చిన ఒకే నిరీక్షణ ఉంది. కాబట్టి రోములో ఉన్న సంఘంలోని వాళ్లందరూ, నేపథ్యంతో సంబంధం లేకుండా, ‘ఒకరినొకరు ఆహ్వానించుకోవాలి’ లేదా ఒకరినొకరు ప్రేమతో చేర్చుకోవాలి.—రోమీయులు 15:7, అధస్సూచి.

a దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి “పవిత్రశక్తి అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

b హీబ్రూ లేఖనాలను కొన్నిసార్లు పాత నిబంధన అని పిలుస్తారు.