కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

మీకా 6:8​—“దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించు”

మీకా 6:8​—“దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించు”

 “ఓ మనిషీ, ఏది మంచిదో ఆయన నీకు తెలియజేశాడు. బదులుగా యెహోవా నిన్నేమి అడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకోవడం, విశ్వసనీయతను ప్రేమించడం, అణకువ కలిగి నీ దేవునితో నడవడం, ఇంతే కదా!”—మీకా 6:8, కొత్త లోక అనువాదం.

 “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—మీకా 6:8, పరిశుద్ధ గ్రంథము.

మీకా 6:8 అర్థమేంటి?

 యెహోవా a దేవుణ్ణి సంతోషపెట్టడం మనుషులకు మరీ కష్టం కాదని మీకా ప్రవక్త చెప్తున్నాడు. (1 యోహాను 5:3) దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఈ వచనం మూడు అర్థవంతమైన మాటల్లో వివరిస్తుంది. మొదటి రెండు మాటలు ముఖ్యంగా ఒక వ్యక్తి తోటివాళ్లతో ఎలా నడుచుకోవాలో చెప్తుంటే, మూడో మాట అతనికి దేవునితో ఉన్న స్నేహం గురించి మాట్లాడుతుంది.

 “న్యాయంగా నడుచుకోవడం.” తనను ఆరాధించేవాళ్లు న్యాయంగా, నిష్పక్షపాతంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం ఏది మంచి ఏది చెడు అనే విషయంలో దేవుడు పెట్టిన ప్రమాణాల ప్రకారం ఆలోచించాలి, ప్రవర్తించాలి. (ద్వితీయోపదేశకాండం 32:4) ఉదాహరణకు, దేవుని ప్రమాణాల్ని పాటించేవాళ్లు ప్రజల నేపథ్యం, దేశం ఏదైనా, వాళ్లు డబ్బున్న వాళ్లు అయినా పేదవాళ్లు అయినా అందరితో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండడానికి కృషి చేస్తారు.—లేవీయకాండం 19:15; యెషయా 1:17; హెబ్రీయులు 13:18.

 “విశ్వసనీయతను ప్రేమించడం.” ఈ మాటను “విశ్వసనీయ ప్రేమను ప్రేమించడం” అని కూడా అనువదించవచ్చు. (మీకా 6:8, అధస్సూచి) “విశ్వసనీయత” అని అనువదించిన హీబ్రూ పదం, వేరే వ్యక్తికి నమ్మకంగా ఉండడాన్ని మాత్రమే సూచించట్లేదు, బదులుగా అతని మీద దయ, కరుణ చూపిస్తూ మనం చేయాల్సిన దానికి మించి చేయడాన్ని సూచిస్తుంది. తనను సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు కేవలం దయ, కరుణ చూపించడమే కాదు ఆ లక్షణాల్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే, ఆయన్ని ఆరాధించేవాళ్లు ఇతరులకు, ముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్లకు సంతోషంగా సహాయం చేయాలి. ఇవ్వడంలో ఆనందం ఉంది.—అపొస్తలుల కార్యాలు 20:35.

 “అణకువ కలిగి నీ దేవునితో నడవడం.” బైబిల్లో “నడవడం” అనే మాటకు “ఫలానా విధంగా జీవించడం లేదా ప్రవర్తించడం” అనే అర్థం కూడా ఉంది. ఒక వ్యక్తి దేవునికి సంతోషం కలిగించేలా జీవించినప్పుడు అతను దేవునితో నడిచినట్టు. ఈ విషయంలో నోవహు మంచి ఉదాహరణ. అతను “సత్యదేవునితో నడిచాడు.” ఎందుకంటే అతను దేవుని దృష్టిలో నీతిమంతుడు, అలాగే “తన సమకాలీనుల్లో మచ్చలేని మనిషిగా ఉన్నాడు.” (ఆదికాండం 6:9) నేడు మనం దేవుని వాక్యం అయిన బైబిల్లో ఉన్న బోధల ప్రకారం జీవించినప్పుడు ‘దేవునితో నడుస్తాం.’ అలా చేయాలంటే మనకు అణకువ ఉండాలి, అంటే మన పరిమితుల్ని అర్థం చేసుకుని, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి ఉన్నామని గుర్తించాలి.—యోహాను 17:3; అపొస్తలుల కార్యాలు 17:28; ప్రకటన 4:11.

మీకా 6:8 సందర్భం

 మీకా ప్రాచీన ఇశ్రాయేలులో క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో ప్రవక్తగా సేవ చేశాడు. ఆ కాలంలో దేశంలో ఎక్కడ చూసినా విగ్రహారాధన, మోసం, దౌర్జన్యమే ఉండేవి. (మీకా 1:7; 3:1-3, 9-11; 6:10-12) దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని ఆజ్ఞల్ని ఎక్కువమంది ఇశ్రాయేలీయులు పాటించడం లేదు. ఏవో కొన్ని మతపరమైన ఆచారాలు పాటిస్తూ బలులు అర్పిస్తే చాలు దేవుడు తమను ఆమోదిస్తాడని చాలామంది తప్పుగా అనుకున్నారు.—సామెతలు 21:3; హోషేయ 6:6; మీకా 6:6, 7.

 మీకా కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత యేసు కూడా తన తండ్రి ప్రేమ, న్యాయం, కరుణ చూపించేవాళ్లను ఇష్టపడతాడని, కేవలం పైపైన భక్తి చూపించేవాళ్లను ఇష్టపడడని చెప్పాడు. (మత్తయి 9:13; 22:37-39; 23:23) యేసు మాటలు నేడు దేవున్ని ఆరాధించేవాళ్ల నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి.

 మీకా పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనే పేరు హీబ్రూ భాషలో దేవుని పేరుకు అనువాదం. ఆ పేరు హీబ్రూ భాషలో יהוה (ఇంగ్లీష్‌లో-YHWH) అని ఉంటుంది; వాటిని హీబ్రూ నాలుగు హల్లులు (Tetragrammaton) అంటారు. యెహోవా గురించి అలాగే కొన్ని బైబిళ్లు ఆ పేరు ఎందుకు ఉపయోగించలేదు అనేదాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.