కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

మత్తయి 6:34—“రేపటిని గురించి చింతించకండి”

మత్తయి 6:34—“రేపటిని గురించి చింతించకండి”

“రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.”—మత్తయి 6:34, కొత్త లోక అనువాదం.

“రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.”—మత్తయి 6:34, పరిశుద్ధ బైబల్‌: ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

మత్తయి 6:34 అర్థమేంటి?

ఎప్పుడో వచ్చే సమస్యల గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన లేదా అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తూ యేసు తన మాటలు వింటున్న ప్రజలకు అభయమిచ్చాడు. వాళ్లు ఏ రోజు సమస్యల్ని ఆ రోజు చూసుకుంటే ఉపయోగం ఉంటుంది.

రేపటి గురించి ఆలోచించొద్దని లేక భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవద్దని యేసు ఉద్దేశం కాదు. (సామెతలు 21:5) బదులుగా, రేపు ఏమి జరుగుతుందోనని విపరీతంగా ఆలోచించకుండా లేదా ఆందోళనపడకుండా ఉండేందుకు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ మనం అలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సంతోషాన్ని కోల్పోతాం, చేయాల్సిన పనుల మీద సరిగ్గా ధ్యాస పెట్టలేం. భవిష్యత్తులో రాగల సమస్యల గురించి ఇప్పుడు కంగారుపడినంత మాత్రాన వాటిని పరిష్కరించలేం. కొన్నిసార్లు మనం కంగారుపడినట్టు అసలు జరగకపోవచ్చు లేదా సమస్య మనం ఊహించుకున్నంత పెద్దది కాకపోవచ్చు.

మత్తయి 6:34 సందర్భం

యేసు చెప్పిన ఆ మాటలు తన ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలోనివి. ఈ ప్రసంగం మత్తయి 5-7 అధ్యాయాల్లో ఉంది. అనవసరంగా ఆందోళనపడితే మన జీవితాలు సంతోషకరంగా మారిపోవని, మన ఆయుష్షు ఏమీ పెరగదని ఆయన తన ప్రసంగంలో వివరించాడు. (మత్తయి 6:27) మన జీవితంలో దేవుణ్ణి ముందు పెడితే, రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. దేవుడు మొక్కల్ని, జంతువుల్నే చూసుకుంటున్నాడంటే, తన సేవకుల్ని చూసుకోడా? తప్పకుండా చూసుకుంటాడు!—మత్తయి 6:25, 26, 28-33.

మత్తయి 6వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.