కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

కీర్తన 37:4—‘యెహోవాను బట్టి సంతోషించు’

కీర్తన 37:4—‘యెహోవాను బట్టి సంతోషించు’

 “యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు.”—కీర్తన 37:4, కొత్త లోక అనువాదం.

 “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.”—కీర్తన 37:4, పరిశుద్ధ గ్రంథము.

కీర్తన 37:4 అర్థమేంటి?

 దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండమని, దానిలోనే ఆనందం పొందమని కీర్తనకర్త దేవుని సేవకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరైతే ఆయనతో స్నేహం చేస్తారో, వాళ్లకున్న సరైన కోరికల్ని యెహోవా a దేవుడు తప్పకుండా తీరుస్తాడనే నమ్మకంతో వాళ్లు ఉండవచ్చు.

 “యెహోవాను బట్టి అధికంగా సంతోషించు.” ఈ మాటను ‘యెహోవాను బట్టి సంతోషించు,’ ‘యెహోవాను సేవించడంలో ఆనందించు,’ “యెహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో” అని కూడా అనువదించారు. సూటిగా చెప్పాలంటే, వేరే దేనికన్నా సత్యదేవున్ని ఆరాధించడంలోనే మనం గొప్ప సంతోషాన్ని పొందాలి. ఎందుకలా చెప్పవచ్చు?

 యెహోవాను ఆరాధించేవాళ్లు బైబిల్లో ఉన్న ఆయన ఆలోచనలకు తగ్గట్టు విషయాల్ని చూస్తారు. వాళ్లకు దేవుడు ఉన్నాడని తెలియడమే కాదు, ఆయన మాట వినడమే తెలివైన పని అని కూడా తెలుసు. అందుకే వాళ్లకు మంచి మనస్సాక్షి ఉంటుంది, జీవితంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. (సామెతలు 3:5, 6) ఉదాహరణకు అవినీతిగా, అత్యాశగా ప్రవర్తించే ప్రజలు పైకి ఎదుగుతున్నట్టు కనిపించినప్పుడు వాళ్లు కోపంతో, ఈర్ష్యతో రగిలిపోరు. (కీర్తన 37:1, 7-9) దేవుడు త్వరలోనే అన్యాయం అంతటినీ తీసేస్తాడనీ, నమ్మకమైనవాళ్ల మంచి ప్రవర్తనకు ప్రతిఫలాన్ని ఇస్తాడనే విషయాల్ని బట్టి వాళ్లు సంతోషిస్తారు. (కీర్తన 37:34) అంతేకాదు, తమ పరలోక తండ్రి అనుగ్రహం వాళ్లమీద ఉందనే విషయం కూడా వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.—కీర్తన 5:12; సామెతలు 27:11.

 “ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు.” ఈ మాటల్ని “ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు” లేదా “మీరు బాగా కోరుకున్నవాటిని ఇస్తాడు” అని కూడా అనువదించవచ్చు. అంటే దానర్థం యెహోవా ఏది పడితే అది మనకిస్తాడని కాదు. ప్రేమగల తల్లిదండ్రుల్లాగే, యెహోవాకు కూడా తన పిల్లలకు ఏది ఇస్తే వాళ్లు సంతోషంగా ఉంటారో తెలుసు. అంతేకాదు మన ప్రార్థనలు-పనులు, ఆయన ప్రమాణాలకు-ఇష్టానికి తగ్గట్టు ఉండాలి. (సామెతలు 28:9; యాకోబు 4:3; 1 యోహాను 5:14) అప్పుడే “ప్రార్థనలు వినే దేవుడు” మనం చెప్పేవి తప్పకుండా వింటాడనే ధైర్యంతో ఉండవచ్చు.—కీర్తన 65:2; మత్తయి 21:22.

కీర్తన 37:4 సందర్భం

 37వ కీర్తనను ప్రాచీన ఇశ్రాయేలులో జీవించిన రాజైన దావీదు కూర్చాడు. ఆయన ఈ కీర్తనను అక్షరమాల క్రమంలో రాశాడు. b

 దావీదు ఎన్నో అన్యాయాల్ని ఎదుర్కొన్నాడు. రాజైన సౌలు అలాగే ఇతరులు ఆయన ప్రాణం తీయడానికి వెంటపడ్డారు. (2 సమూయేలు 22:1) అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. యెహోవా ఏదోక రోజు దుష్టుల్ని శిక్షిస్తాడని దావీదుకు తెలుసు. (కీర్తన 37:10, 11) వాళ్లు “పచ్చగడ్డిలా” వర్ధిల్లుతున్నట్టు కనిపించినా చివరికి మాయమైపోతారు.—కీర్తన 37:2, 20, 35, 36.

 దేవుని ప్రమాణాల్ని పాటించేవాళ్లు ఎలాంటి ప్రతిఫలం పొందుతారో, పాటించనివాళ్లు చివరికి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారో 37వ కీర్తన చెప్తుంది. (కీర్తన 37:16, 17, 21, 22, 27, 28) తెలివి సంపాదించుకునేలా, దేవునికి ఇష్టమైన విధంగా జీవించేలా ఈ కీర్తన సహాయం చేస్తుంది.

 కీర్తన పుస్తకంలోని ప్రాముఖ్యమైన వివరాల్ని తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియోను చూడండి.

a హీబ్రూ భాషలో దేవుని పేరును తెలుగులో యెహోవా అంటారు. చాలా అనువాదాలు ఆ పేరు తీసేసి, దాని బదులు ప్రభువు అని ఎందుకు పెట్టారో తెలుసుకోవడానికి “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ఈ క్రమంలో పాటల్ని కూర్చేటప్పుడు, మొదటి వచనం హీబ్రూ భాష అక్షరమాలలోని మొదటి అక్షరంతో మొదలౌతుంది, తర్వాతి వచనం రెండవ అక్షరంతో మొదలౌతుంది. మిగతా వచనాల్ని కూడా ఈ క్రమంలో రాసేవారు. కీర్తనల్ని ఇంకా ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించి ఉంటారు.