కంటెంట్‌కు వెళ్లు

పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 పచ్చబొట్టు లేదా టాటూల గురించి బైబిలు కేవలం ఒక్కసారే ప్రస్తావించింది. లేవీయకాండము 19:28 లో ఇలా ఉంది: “పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు.” ఇశ్రాయేలీయుల చుట్టుపక్కల ఉండే ప్రజలు, శరీరం మీద తమ దేవుళ్ల పేర్లను లేదా గుర్తులను పచ్చబొట్టులా వేసుకునేవాళ్లు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ చుట్టు పక్కల ప్రజల నుండి వేరుపర్చడానికే దేవుడు వాళ్లకు ఆ ఆజ్ఞను ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 14:2) ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ ఆజ్ఞ ఇప్పటి క్రైస్తవులకు వర్తించకపోయినా, దాని వెనుక ఉన్న సూత్రాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.

ఒక క్రైస్తవుడు పచ్చబొట్టు లేదా టాటూ వేయించుకోవచ్చా?

 ఈ విషయం గురించి తెలుసుకోవడానికి కిందున్న బైబిలు లేఖనాలు మీకు సహాయం చేస్తాయి:

  •   ‘స్త్రీలు అణుకువ గలవారై’ ఉండాలి. (1 తిమోతి 2:9) ఈ సూత్రం ఆడవాళ్లకు, మగవాళ్లకు ఇద్దరికీ వర్తిస్తుంది. మనం ఎదుటివాళ్ల భావాలను గౌరవించాలి. అనవసరంగా వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించకూడదు.

  •   కొంతమంది గుర్తింపు పొందాలని లేదా స్వచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. ఇంకొంతమందేమో తమ శరీరం మీద తమకు హక్కుందని చూపించుకోవడానికి టాటూలు వేయించుకుంటారు. ఏదేమైనా బైబిలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహిస్తుంది, “మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకోండి. అలా మీరు మీ ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి పవిత్ర సేవ చేయగలుగుతారు.” (రోమీయులు 12:1, NW) అసలు మీరు టాటూ ఎందుకు వేయించుకోవాలనుకుంటున్నారో “మీ ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించి పరిశీలించుకోండి. ఒకవేళ క్షణక్షణానికీ మారిపోయే ఫ్యాషన్ను ఫాలో అవ్వడానికో లేదా ఫలానా గుంపులో మీరూ ఒక సభ్యుడని చూపించుకోవాడానికో టాటూ వేయించుకోవాలనుకుంటున్నారా? అలాగైతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన కొంతకాలానికి మారిపోవచ్చు కానీ మీరు వేయించుకునే టాటూ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. మీ ఉద్దేశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం ద్వారా మీరు తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు.—సామెతలు 4:7.

  •   “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామెతలు 21:5) తరచూ తొందరపాటుతో టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ అది ఇతరులతో మీకున్న సంబంధాల మీద, మీ ఉద్యోగం మీద చాలా ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. అంతేకాదు టాటూలను చెరిపేసుకోవడం చాలా ఖర్చు, నొప్పితో కూడుకున్న పని. పరిశోధనల బట్టి అలాగే టాటూలను చెరిపేసే వ్యాపారానికి పెరుగుతున్న ఆదరణను బట్టి, టాటూలు వేయించుకున్న చాలామంది వాటిని తర్వాత ఇష్టపడడం లేదని మనకు అర్థమౌతుంది.