కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం | వివాహం

టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

 టెక్నాలజీని వాడే విధానం వల్ల మీ వివాహ బంధం బలపడవచ్చు లేదా బలహీనపడవచ్చు. ఇంతకీ మీ వివాహ బంధం బలపడుతోందా లేక బలహీనపడుతోందా?

 మీరేం తెలుసుకోవాలి?

  •   టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే, అది వివాహ బంధాన్ని బలపర్చగలదు. ఉదాహరణకు, భర్త/భార్య పక్కన లేనప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అది సహాయం చేస్తుంది.

     ‘ఐ లవ్‌ యూ’ లేదా ‘నీ గురించి ఆలోచిస్తున్నాను’ అనేది చిన్న మెసేజ్‌ అయినా, అది మిమ్మల్ని మీ వివాహజతకు దగ్గర చేయగలదు.”—జొనాతన్‌.

  •   టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించకపోతే, అది వివాహ బంధాన్ని బలహీనపర్చగలదు. ఉదాహరణకు, కొంతమంది ఫోన్‌ లేదా టాబ్లెట్‌ను అదేపనిగా వాడడం వల్ల తమ వివాహజతకు పెట్టే సమయం, శ్రద్ధ తగ్గిపోతున్నాయి.

     “నా చేతిలో ఫోన్‌ లేనప్పుడే నా భర్త నాతో మాట్లాడడానికి ఎక్కువ సుముఖత చూపించడం నేను గమనించాను.”జూలిస.

  •   ఒక వైపు ఫోన్‌ లేదా టాబ్లెట్‌ వాడుతూనే తమ వివాహజతతో చక్కగా మాట్లాడగలమని కొంతమంది చెప్తారు. “ఒకేసారి రెండు మూడు పనులు విజయవంతంగా చేయగలం అనుకోవడం అపోహ” అని షెరీ టర్కల్‌ అనే సామాజికవేత్త చెప్తుంది. ఒకేసారి రెండు మూడు పనులు చేయగలగడం గొప్ప విషయమని ప్రజలు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఆ సామాజికవేత్త ఏమంటుందంటే, “ఒకేసారి ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తే ఆ పనులు అంత బాగా చేయలేం.” a

     “నా భర్త నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ చూసుకుంటూ ఉంటే నాకు బాధేస్తుంది. ఆయన అలా చేసినప్పుడు, నాతో కన్నా తన ఫోన్‌తో లేదా టాబ్లెట్‌తో గడపడమే తనకు ఇష్టమేమో అనిపిస్తుంది.”—శారా.

 ఒక్కమాటలో: మీరు టెక్నాలజీ వాడే విధానం మీ వివాహ బంధాన్ని బలపర్చగలదు లేదా బలహీనపర్చగలదు.

 మీరేం చేయవచ్చు?

 ఏవి ఎక్కువ ప్రాముఖ్యమో తెలుసుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’ (ఫిలిప్పీయులు 1:10) ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను, నా వివాహజత ఒకరితో ఒకరం గడపాల్సిన సమయాన్ని ఫోన్లకు లేదా టాబ్లెట్లకు పెడుతున్నామా?’

 “భోంచేయడానికి రెస్టారెంట్‌కి వచ్చిన భార్యాభర్తలు ఎవరి ఫోన్‌తో వాళ్లు బిజీగా ఉండడం చూసినప్పుడు నాకు బాధేస్తుంది. మేం టెక్నాలజీకి బానిసలైపోయి, అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని అంటే మా వివాహ బంధాన్ని మర్చిపోవాలని కోరుకోం.”—మాథ్యూ.

 హద్దులు పెట్టుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “మీరు ఎలా నడుచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మీరు తెలివితక్కువ వాళ్లలా కాకుండా తెలివిగల వాళ్లలా నడుచుకోండి. మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.” (ఎఫెసీయులు 5:15, 16) మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘వచ్చిన ప్రతీ మెసేజ్‌కి వెంటనే స్పందించే బదులు, అంత ప్రాముఖ్యంకాని మెసేజ్‌లను చదవడానికి, రిప్లై ఇవ్వడానికి వేరే ఒక సమయం పెట్టుకోగలనా?’

 ఫోన్‌ సైలెంట్‌లో పెట్టుకుని, వీలు కుదిరినప్పుడు మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని నేను గమనించాను. అత్యవసరంగా బదులివ్వాల్సిన ఫోన్‌ కాల్‌, మెసేజ్‌, లేదా ఈ-మెయిల్‌ ఎప్పుడోగానీ ఉండవు.”—జొనాతన్‌.

 వీలైతే మీ ఆఫీసు పనులు ఆఫీసులోనే విడిచిపెట్టండి. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతీదానికి సమయము కలదు.” (ప్రసంగి 3:1) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్‌లో ఆఫీసు పనులు చేసుకుంటూ, నా కుటుంబంతో సమయం గడపలేకపోతున్నానా? దానివల్ల నా వివాహ బంధం బలపడుతుందా లేక బలహీనపడుతుందా? దీని గురించి నా భర్త/భార్య ఏమంటున్నారు?’

 “టెక్నాలజీ వల్ల ఎక్కడైనా, ఎప్పుడైనా ఆఫీసు పనులు చేయడం వీలౌతుంది. అయితే నేను నా భార్యతో ఉన్నప్పుడు నా ఫోన్‌ను అదేపనిగా చూసుకోకుండా, ఆఫీసు పనులు చేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాను.”—మాథ్యూ.

 టెక్నాలజీని వాడే విధానం గురించి మీ భర్త/భార్యతో చర్చించండి. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి.” (1 కొరింథీయులు 10:24) మీ ఇద్దరూ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో, ఏమేం మార్పులు చేసుకోవాలో ఒకరితో ఒకరు చర్చించుకోండి. ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన చర్చించాల్సిన విషయాలు ఉపయోగించి మీరు మాట్లాడుకోవడం మొదలుపెట్టవచ్చు.

 “నేనూ నా భర్త ఒకరితో ఒకరం చాలా నిజాయితీగా ఉంటాం. మాలో ఎవరైనా ఫోన్‌ లేదా టాబ్లెట్‌ అతిగా ఉపయోగిస్తున్నారని అనిపిస్తే వాళ్లతో ఆ విషయం చెప్పడానికి వెనకాడం. వాటిని అతిగా ఉపయోగించడం ఒక సమస్యలా మారవచ్చని గుర్తించి, ఒకరి అభిప్రాయాల్ని ఒకరం ఎంతో గౌరవిస్తాం.”—డాన్యేల్‌.

 ఒక్కమాటలో: టెక్నాలజీని మీ చెప్పుచేతల్లో ఉంచుకోండి, దానికి బానిసలు అవ్వకండి.

a రిక్లైమింగ్‌ కన్వర్జేషన్‌—ద పవర్‌ ఆఫ్‌ టాక్‌ ఇన్‌ ఎ డిజిటల్‌ ఏజ్‌ అనే పుస్తకం నుండి తీసుకోబడింది.