కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

2013లో దాదాపు 20 కోట్ల మందికి మలేరియా వ్యాధి సోకిందని, దాదాపు 5,84,000 మంది దానివల్ల చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా. అందులో దాదాపు 80 శాతం ఐదేళ్ల లోపు పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల 320 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారు.

1 మలేరియా అంటే ఏమిటి?

కొన్ని సూక్ష్మజీవులు వేరే జీవుల శరీరంలో నివసిస్తాయి. అలాంటి ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి మలేరియా. ఆ వ్యాధి లక్షణాలు: జ్వరం, చలి, చెమటలు పట్టడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పినట్లు ఉండడం, వాంతులు. వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి రకాన్ని బట్టి, వ్యాధి ఎంతకాలం నుండి ఉంది అనే దాన్నిబట్టి ఈ లక్షణాలు 48-72 గంటల వ్యవధిలో మళ్లీమళ్లీ కనిపిస్తుంటాయి.

2 మలేరియా ఎలా వస్తుంది?

  1. ఆడ అనాఫిలిస్‌ దోమ కాటువల్ల మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి.

  2. ఆ సూక్ష్మజీవులు రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి (liver cells) ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది.

  3. కాలేయ కణాలు పగిలినప్పుడు, ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది.

  4. ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చి మరిన్ని రక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి.

  5. ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం, అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

3 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే . . .

  • దోమ తెర ఉపయోగించండి. దోమతెరను

    • శుభ్రంగా ఉతకాలి.

    • రంధ్రాలు, చినుగులు లేకుండా చూసుకోవాలి.

    • కింద ఖాళీల్లో నుండి దోమలు రాకుండా పరుపు కిందకు పూర్తిగా నెట్టండి.

  • దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు కొట్టండి.

  • వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్‌లు బిగించండి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించండి.

  • లేత రంగులో ఉండి, శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోండి.

  • దోమలు కొన్ని చెట్లు, పొదల దగ్గరగా గుంపులుగా ఉంటాయి. వీలైతే, అలాంటి చోట్లకు వెళ్లకండి. నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి.

  • వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి.

మీరు మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తుంటే . . .

  • వెళ్లేముందు అక్కడున్న పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకోండి. ఈ వ్యాధి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్లాస్మోడియం వల్ల వస్తుంది. దాన్ని బట్టి వాడాల్సిన మందులు కూడా మారుతాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఈ వ్యాధి విషయంలో మీరేమైనా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అని మీ డాక్టరును అడగడం మంచిది.

  • మీరు ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు, పైన ఇచ్చిన జాగ్రత్తలు పాటించండి.

  • వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి. వ్యాధి సోకిన 1 నుండి 4 వారాల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయని గుర్తుంచుకోండి.